Saturday, May 30, 2026

మల్కాపూర్ గ్రామ శివారులో వారణాసి హోటల్ రెస్టారెంట్ ప్రారంభం

 

మల్కాపూర్ గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన వారణాసి హోటల్ రెస్టారెంట్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారు ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో హోటల్‌ను ఏర్పాటు చేయడంపై వారు నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా యువత స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకొని ముందుకు రావాలని సూచించారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇలాంటి వ్యాపార సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం హోటల్ నిర్వాహకులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారిని, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విఠల్ , గోవర్ధన్ , శ్రీధర్ రెడ్డి, గోవర్ధన్ నాయక్ ,అంజాద్,దేవేందర్ తదితరులు ఉన్నారు.

Thursday, May 28, 2026

జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో నందీశ్వర శిలాలభ్యత పై మీడియా సమావేశం


సంగారెడ్డి మే 28: సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ప్రపంచంలోనే అతిపెద్ద నందీశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ఆశ్రమంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. 30 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పు, 19 అడుగుల ఎత్తులో నందీశ్వర విగ్రహాన్ని తయారు చేయిస్తామని చెప్పారు. రాయి బరువు 684 టన్నులు ఉంటుందన్నారు. విగ్రహం కు సంబంధించిన రాయి కంది మండలం  ఎర్థనూర్ శివారులోని కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో లభ్యమైనట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయం లో ఉన్న నంది ప్రస్తుతం అతిపెద్ద విగ్రహం అని చెప్పారు. ఆశ్రమంలో త్వరలో ఏర్పాటుచేసే నంది  విగ్రహం దానికంటే ఎత్తు బరువు ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో భారీ వాహనంలో ఊరేగింపుగా ఆశ్రమానికి తీసుకువస్తామని తెలిపారు. విద్యాపీఠం మీడియా ఇన్ఛార్జి తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో అతిపెద్ద నందీశ్వర విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇందులో తాను కూడా భాగస్వామిని కావడం పూర్వజన్మ అదృష్టమని పేర్కొన్నారు. అనంతరం నందీశ్వర ప్రతిమను ఆవిష్కరించారు. సమావేశంలో సభ్యులు ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.

లివర్ వ్యాధులపై అప్రమత్తత అవసరం. డాక్టర్ పోలవరపు నవీన్


 సంగారెడ్డి, మే 28 : ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న క్యాన్సర్లలో లివర్ క్యాన్సర్ ఒకటిగా మారుతోందని యశోద ఆసుపత్రి హైటెక్ సిటీకి చెందిన సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ వ్యాధుల నిపుణుడు డాక్టర్ నవీన్ పోలవరపు తెలిపారు. సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యాటీ లివర్, హెపటైటిస్ బి, సి వైరస్లు, అధిక మద్యపానం వంటి కారణాలతో లివర్ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. లివర్ వ్యాధులను “నిశ్శబ్ద హంతకాలు”గా అభివర్ణిస్తూ, కాళ్లు వాపులు, పొట్ట ఉబ్బరం, లివర్ క్యాన్సర్ వంటి లక్షణాలు బయటపడే వరకు చాలా మందికి వ్యాధి ఉన్న విషయం తెలియదని పేర్కొన్నారు. అప్పటికే వ్యాధి ముదిరిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రమం తప్పకుండా రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు. హెపటైటిస్ బి, సి వైరస్లు చాలామందిలో తెలియకుండానే శరీరంలో ఉండి క్రమంగా లివర్‌ను దెబ్బతీస్తాయని తెలిపారు. ముందుగానే పరీక్షల ద్వారా గుర్తిస్తే వ్యాక్సినేషన్, సరైన చికిత్సలతో ప్రమాదాన్ని తగ్గించవచ్చన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలన లక్ష్యంగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఫ్యాటీ లివర్ నివారణకు కొలెస్ట్రాల్, మధుమేహం, థైరాయిడ్ సమస్యలను అదుపులో ఉంచుకోవడం అవసరమన్నారు. అధిక మద్యపానం వల్ల ప్యాంక్రియాటైటిస్ వచ్చే ప్రమాదం ఉందని, ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించారు. మద్యపానం తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం ద్వారా లివర్, ప్యాంక్రియాస్ దెబ్బతినకుండా కాపాడుకోవచ్చన్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల గ్యాస్ట్రిక్, జీర్ణకోశ సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. మలవిసర్జనలో మార్పులు, మలంలో రక్తస్రావం, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు రెండు వారాలకు మించి కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కొలనోస్కోపీ పరీక్ష ద్వారా పేగుల్లో ఏర్పడే పాలిప్‌లను ప్రారంభ దశలోనే గుర్తించి తొలగించడం ద్వారా పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించవచ్చన్నారు. పాశ్చాత్య దేశాల్లో కొలనోస్కోపీపై అవగాహన పెరగడంతో పెద్దప్రేగు క్యాన్సర్ కేసులు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి హైటెక్ సిటీ వైద్య నిపుణులు, కార్పొరేట్ రిలేషన్స్ అధికారి మహేష్, సంగారెడ్డి ప్రతినిధి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Thursday, May 21, 2026

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

 


రోగులకు పండ్ల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

సంగారెడ్డి, మే 21: భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో గురువారం ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్ పార్కులో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని, యువతకు అవకాశాలు కల్పించడంలో, సాంకేతిక రంగ అభివృద్ధికి పునాది వేయడంలో రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన నాయకులు అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, ధైర్యం చెప్పారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్, కౌన్సిలర్లు తోపాజి వీణ హరీష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన విభాగ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

 


తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్

సంగారెడ్డి, మే 20 : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సంగారెడ్డి వలయ సాధారణ సమావేశం మంగళవారం జిల్లా విద్యుత్ ప్రధాన కార్యాలయ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశంలో పలువురు వక్తలు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వము ఉద్యోగులకు రావలసిన వేతన సవరణలు (పీఆర్సీ) తక్షణమే అమలు చేయాలని కోరారు. పదోన్నతుల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎటువంటి జాప్యం లేకుండా న్యాయబద్ధంగా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, ఉద్యోగుల హక్కులను పరిరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విద్యుత్ సంస్థ యాజమాన్యం నుండి ఉద్యోగులకు అందవలసిన పలు సంక్షేమ అంశాలు, సేవా సంబంధిత సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం సంఘం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ అండ్ ఎస్టి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షులు నరసింహ, ఎం. సుధాకర్, సంగారెడ్డి వలయ అధ్యక్షుడు వినయ్ కుమార్, ఉప వలయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.

ఏపీసీఆర్ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహణ

 

సంగారెడ్డి, మే 20 :ప్రజల్లో న్యాయంపై అవగాహన పెంపొందించేందుకు ఏపీసీఆర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నగరంలోని సిటీ ఆడిటోరియం ఫంక్షన్ హాల్లో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ సభ్యుడు వి. రఘునాథ్ ముఖ్య అతిథిగా హాజరై న్యాయ హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రసంగించారు. ప్రజలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖాదర్ ఫైసల్, భారత్ సాయి, వరయ్య యాదవ్, షహానా మేడం, న్యాయవాది సోహైల్ అలీ, కౌన్సిలర్ నవాజ్, మిల్లీ ఫోరం ప్రతినిధి షఫీయూర్ రహ్మాన్, కన్వీనర్ అబ్దుల్ మన్నాన్, ఏపీసీఆర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముక్తార్ హుస్సేన్, మౌలానా షేక్ ముబీన్, న్యాయవాది మనోహర్, ఒవైస్ ఉద్దీన్ ఒవైస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, పలువురు యువకులు పాల్గొన్నారు.

Tuesday, May 19, 2026

ఘనంగా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ప్రథమ వార్షికోత్సవం -పెండింగ్ హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

 

సంగారెడ్డిలోని జీఆర్‌కే ఫంక్షన్ హాలులో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.రాఘవరెడ్డి విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఉద్యోగులకు ఇచ్చిన పలు హామీలు ఇప్పటికీ అమలుకాకపోవడం బాధాకరమని అన్నారు. కార్యాలయాల్లో కుర్చీలు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని కోరారు. అలాగే 2017 సంవత్సరానికి చెందిన 20 అంగన్వాడీ కేంద్రాల ఉద్యోగుల పెండింగ్ వేతనాలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. విశ్రాంత ఉద్యోగులకు బస్సు ప్రయాణ రాయితీలు, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, పింఛన్ సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు. విధుల్లో ఉన్న ఉద్యోగులకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే ఉద్యోగుల తరఫున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన పూర్ణ వనిత మాట్లాడుతూ, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల కోసం 200 గజాల స్థలంలో భవన నిర్మాణానికి చర్యలు తీసుకునేలా టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఉద్యోగులు సమాజానికి అందిస్తున్న సేవలను ఆమె అభినందించారు. అనంతరం సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ మాట్లాడుతూ, విశ్రాంత ఉద్యోగులు తొలిసారిగా ఒక వేదికపై సమావేశం కావడం ఆనందదాయకమని అన్నారు. పింఛన్లు సక్రమంగా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సంఘటితంగా ముందుకు సాగుతున్న ఉద్యోగుల కృషిని ఆయన ప్రశంసించారు.

Sunday, May 17, 2026

జనగణనలో ప్రజలు సహకరించాలి -సంగారెడ్డిలో ఎంఐఎం నేతల మీడియా సమావేశం

 

సంగారెడ్డి ప్రతినిధి, మే 16: కర్వాన్ ఎమ్మెల్యే, సంగారెడ్డి ఇన్‌చార్జి కౌసర్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఎంఐఎం పార్టీ సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణన ప్రక్రియలో ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. కుటుంబ యజమానితో పాటు కుటుంబ సభ్యుల వివరాలను సరైన ఆధార పత్రాలతో నమోదు చేయించుకోవాలని సూచించారు. ఇంటి పేరు, తండ్రి పేరు, వయస్సు, విద్యార్హతలు తదితర వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని తెలిపారు. నిర్దేశిత గడువులోగా జనగణన నమోదు చేయించుకోకపోతే భవిష్యత్తులో ఓటరు జాబితాలో పేర్లు లేకపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇంటింటికి వచ్చే గణన సిబ్బందికి ప్రజలు సహకరించి అవసరమైన సమాచారాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యక్తిగత సహాయకుడు ముస్తాక్ మాట్లాడుతూ, జనగణన సమయంలో పేర్లు, ఇంటి పేర్లు, తండ్రి పేర్లు తదితర వివరాలను స్పష్టంగా నమోదు చేయించాలని సూచించారు. తప్పులు జరిగితే ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముస్తాక్ సాహెబ్, ఎం.కె. నజీముద్దీన్, పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఫాజిల్ ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ యాకూబ్ అలీ, కౌన్సిలర్ ఏజాజ్, కార్యదర్శి ఇమ్రాన్ జైన్, యువ నాయకుడు సామి, జహంగీర్ భాయ్, మాజీ కౌన్సిలర్ అజ్జు భాయ్, షకీల్ భాయ్, రఫీ భాయ్, అస్లాం భాయ్, ఖాజా భాయ్, ఒమర్ భాయ్, సద్దాం జుల్కల్ తదితరులు పాల్గొన్నారు.

అల్-ఆరిఫ్ విద్యాసంస్థలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు ఘన సన్మానం

సంగారెడ్డి ప్రతినిధి, మే 16 : అల్-ఆరిఫ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు విద్యా ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు. అల్-ఆరిఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు జనాబ్ అల్‌హాజ్ తాహేర్ అలీ షా ఆరిఫీ నూరీ సాహెబ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి మాజీ కౌన్సిలర్ జనాబ్ అల్‌హాజ్ అమీర్ బేగ్ సాహెబ్, ఆరో వార్డు కౌన్సిలర్ జనాబ్ నవాజుద్దీన్ సాహెబ్, జనాబ్ అల్‌హాజ్ పాషా ముల్సాబ్ ఘనీ నూరీ సాహెబ్, జనాబ్ ఇక్బాల్ ముల్సాబ్ హాజరయ్యారు. 

విద్యార్థుల్లో సయ్యదా సోహా సమర్ 557 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, యాస్మీన్ అంజుం 527 మార్కులతో ద్వితీయ స్థానం, సోహా సమీరా 516 మార్కులతో తృతీయ స్థానం పొందారు. అలాగే మహమ్మద్ షాదుల్లా 500, మహమ్మద్ యాసీన్ కల్మాజ్ 498, సోఫియా రజ్మిన్ 474, తబస్సుం ఫాతిమా 468, సుమ్మయ్యా బేగం 378 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అల్-ఆరిఫ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతినిధి జనాబ్ అల్‌హాజ్ మహమ్మద్ మహబూబ్ అలీ, ఉపాధ్యాయులు ఘయాజ్ పర్వేజ్, ఫహీముద్దీన్, ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ అమెరుల్లా హుస్సేన్, ప్రధానోపాధ్యాయురాలు అస్రా మేడం తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్ రూపకల్పన, నాణ్యమైన విద్యా బోధనపై చర్చించారు.

Monday, May 11, 2026

ఘనంగా వేదాన్య పాఠశాల ప్రారంభం

 


సంగారెడ్డి, మే 11 (SNM న్యూస్) : విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుకూలంగా డిజిటల్ తరగతి గదులు, విశాలమైన క్లాస్‌రూములు, పెద్ద ఆట స్థలం, బాక్స్ క్రికెట్ సదుపాయం కల్పించినట్లు వేదాన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని గణేష్‌నగర్‌లో కృష్ణ దేవాలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన వేదాన్య పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం పాఠశాల అసెంబ్లీ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేణు భగవాన్, దామోదర్ రెడ్డి హాజరై మాట్లాడారు. నర్సరీ నుంచి ఏడో తరగతి వరకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. స్నేహపూర్వక అధ్యాపక బృందంతో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల నిర్వహణలో డైరెక్టర్ మనోహర్ గౌడ్, సంజయ్ హాట్కర్, వివేక్ కుమార్ సేవలందిస్తుండగా, కో-డైరెక్టర్లు సంజయ్ సోనాలి, ప్రేమ్ కుమార్, రవితేజ పాల్గొన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపక బృందం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Sunday, May 10, 2026

సంగారెడ్డిలో ఘనంగా ప్రారంభమైన ‘కట్ షైన్’ యూనిసెక్స్ సెలూన్

 


సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో మహిళా సంఘం భవన సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘కట్ షైన్’ యూనిసెక్స్ సెలూన్‌ను కౌన్సిలర్లు నవాజ్, రవి నాయక్, అన్వర్, ఫయాజ్, మోతెశాం, కిరణ్‌లు మేనేజ్‌మెంట్ సభ్యులు మహమ్మద్ జావీద్, అర్షద్ ఖాన్‌లతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెలూన్‌లో ఆధునిక శైలిలో అన్ని రకాల హెయిర్ కటింగ్స్‌తో పాటు పురుషులు, మహిళల కోసం ప్రత్యేక బ్యూటీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం ప్రాణదానం : డాక్టర్ స్వామి గౌడ్


 సంగారెడ్డి పట్టణంలోని సన్‌రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సన్‌రైజ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ స్వామి గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆస్పత్రి ప్రాంగణంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాతలు, శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులు, డాక్టర్ స్వామి గౌడ్ కుటుంబ సభ్యులు తదితరులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వామి గౌడ్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ సేవల్లో రక్తం కొరత ఏర్పడే పరిస్థితులు తరచుగా ఎదురవుతాయని, ఆ సమయంలో రక్తదానం చేసినవారి సహకారమే ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా సన్‌రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎండాకాలంలో రక్త నిల్వలు తగ్గిపోతాయని గుర్తించి ప్రతి ఏడాది మే నెలలో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలలను దత్తత తీసుకుని విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు తదితర విద్యా సామగ్రిని ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. ప్రజల సహకారంతోనే సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే సన్‌రైజ్ హాస్పిటల్‌లో నూతనంగా కార్డియాలజీ సేవలను ప్రారంభించామని, ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా గుండె సంబంధిత వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ స్వామి గౌడ్ కోరారు.

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...