Thursday, May 28, 2026

లివర్ వ్యాధులపై అప్రమత్తత అవసరం. డాక్టర్ పోలవరపు నవీన్


 సంగారెడ్డి, మే 28 : ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న క్యాన్సర్లలో లివర్ క్యాన్సర్ ఒకటిగా మారుతోందని యశోద ఆసుపత్రి హైటెక్ సిటీకి చెందిన సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ వ్యాధుల నిపుణుడు డాక్టర్ నవీన్ పోలవరపు తెలిపారు. సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యాటీ లివర్, హెపటైటిస్ బి, సి వైరస్లు, అధిక మద్యపానం వంటి కారణాలతో లివర్ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. లివర్ వ్యాధులను “నిశ్శబ్ద హంతకాలు”గా అభివర్ణిస్తూ, కాళ్లు వాపులు, పొట్ట ఉబ్బరం, లివర్ క్యాన్సర్ వంటి లక్షణాలు బయటపడే వరకు చాలా మందికి వ్యాధి ఉన్న విషయం తెలియదని పేర్కొన్నారు. అప్పటికే వ్యాధి ముదిరిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రమం తప్పకుండా రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు. హెపటైటిస్ బి, సి వైరస్లు చాలామందిలో తెలియకుండానే శరీరంలో ఉండి క్రమంగా లివర్‌ను దెబ్బతీస్తాయని తెలిపారు. ముందుగానే పరీక్షల ద్వారా గుర్తిస్తే వ్యాక్సినేషన్, సరైన చికిత్సలతో ప్రమాదాన్ని తగ్గించవచ్చన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలన లక్ష్యంగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఫ్యాటీ లివర్ నివారణకు కొలెస్ట్రాల్, మధుమేహం, థైరాయిడ్ సమస్యలను అదుపులో ఉంచుకోవడం అవసరమన్నారు. అధిక మద్యపానం వల్ల ప్యాంక్రియాటైటిస్ వచ్చే ప్రమాదం ఉందని, ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించారు. మద్యపానం తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం ద్వారా లివర్, ప్యాంక్రియాస్ దెబ్బతినకుండా కాపాడుకోవచ్చన్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల గ్యాస్ట్రిక్, జీర్ణకోశ సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. మలవిసర్జనలో మార్పులు, మలంలో రక్తస్రావం, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు రెండు వారాలకు మించి కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కొలనోస్కోపీ పరీక్ష ద్వారా పేగుల్లో ఏర్పడే పాలిప్‌లను ప్రారంభ దశలోనే గుర్తించి తొలగించడం ద్వారా పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించవచ్చన్నారు. పాశ్చాత్య దేశాల్లో కొలనోస్కోపీపై అవగాహన పెరగడంతో పెద్దప్రేగు క్యాన్సర్ కేసులు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి హైటెక్ సిటీ వైద్య నిపుణులు, కార్పొరేట్ రిలేషన్స్ అధికారి మహేష్, సంగారెడ్డి ప్రతినిధి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...