Friday, July 31, 2026

ఫ్లోరోసెన్స్ గైడెడ్, రోబోటిక్ టెక్నాలజీతో క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులు

తక్కువ నొప్పి.. వేగంగా కోలుకునే అవకాశం.. మెరుగైన జీవన నాణ్యతకు ఆధునిక వైద్యం దారి

– యశోద హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. రాజేష్ గౌడ్

హైదరాబాద్, జూలై 31 (SNM న్యూస్):

గత దశాబ్దంలో క్యాన్సర్ చికిత్సలో వైద్యరంగం విశేష పురోగతి సాధించింది. ట్యూమర్ జీవశాస్త్రంపై పెరిగిన అవగాహనతో ప్రస్తుతం క్యాన్సర్ శస్త్రచికిత్సల లక్ష్యం కేవలం వ్యాధిని తొలగించడం మాత్రమే కాకుండా, రోగికి మెరుగైన జీవన నాణ్యతను అందిస్తూ పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని కల్పించడం కూడా అని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీకి చెందిన సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డా. రాజేష్ గౌడ్ తెలిపారు. రోబోటిక్ శస్త్రచికిత్సలు, ఫ్లోరోసెన్స్ గైడెడ్ సర్జరీ వంటి అత్యాధునిక సాంకేతికతలు క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ సాంకేతికతల ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సలు నిర్వహించడంతో పాటు ఆరోగ్యకరమైన కణజాలానికి తక్కువ నష్టం కలుగుతుందని, రక్తస్రావం తగ్గి రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని వివరించారు. హై-డెఫినిషన్ త్రీడీ విజన్, కంపనం లేని శస్త్రచికిత్స పరికరాలు, మానవ చేతి కదలికలను అనుకరించే ప్రత్యేక రోబోటిక్ పరికరాల సహాయంతో క్లిష్టమైన శస్త్రచికిత్సలను సురక్షితంగా నిర్వహించవచ్చని తెలిపారు. గతంలో అవసరమైన పెద్ద కోతలకు బదులుగా కేవలం 8 మిల్లీమీటర్ల చిన్న రంధ్రాల ద్వారానే శస్త్రచికిత్స చేయడం సాధ్యమవుతోందన్నారు. దీనివల్ల రోగికి నొప్పి, రక్తనష్టం, శస్త్రచికిత్స అనంతర మచ్చలు గణనీయంగా తగ్గుతున్నాయని చెప్పారు. గర్భాశయ, అండాశయ క్యాన్సర్లలో రోబోటిక్ శస్త్రచికిత్స ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తోందని డా. రాజేష్ గౌడ్ తెలిపారు. రాడికల్ హిస్టరెక్టమీ, లింఫ్ నోడ్ తొలగింపు వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలను సురక్షితంగా నిర్వహించవచ్చన్నారు. గతంలో నాలుగు నుంచి ఐదు రోజులపాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేదని, ప్రస్తుతం చాలా మంది రోగులను 24 గంటల్లోనే డిశ్చార్జ్ చేయగలుగుతున్నామని వెల్లడించారు. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఫ్లోరోసెన్స్ గైడెడ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు. ప్రత్యేక డై ఇంజెక్షన్ ద్వారా క్యాన్సర్ ప్రభావం మొదటగా చేరే సెంటినెల్ లింఫ్ నోడ్లను స్పష్టంగా గుర్తించి, అవసరమైన వాటినే తొలగించే అవకాశం కలుగుతుందని తెలిపారు. దీంతో చేతి వాపు, నొప్పి వంటి సమస్యలు తగ్గి రోగి జీవన నాణ్యత మెరుగుపడుతుందని వివరించారు. ప్రోస్టేట్, మూత్రాశయం, మూత్రపిండాలు, అడ్రినల్ గ్రంథుల క్యాన్సర్ల చికిత్సలో కూడా రోబోటిక్ సర్జరీ ఉత్తమ ఫలితాలు ఇస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో నరాలను సంరక్షించడం ద్వారా మూత్ర నియంత్రణ, లైంగిక సామర్థ్యాన్ని కాపాడే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. మూత్రపిండాల క్యాన్సర్‌లో కేవలం ట్యూమర్ ఉన్న భాగాన్ని మాత్రమే తొలగించి మిగిలిన ఆరోగ్యకరమైన కిడ్నీని సంరక్షించే 'పాక్షిక నెఫ్రెక్టమీ'ని అధికంగా నిర్వహించగలుగుతున్నామని చెప్పారు. దీని వల్ల పూర్తి కిడ్నీ తొలగించాల్సిన అవసరం తగ్గుతోందన్నారు. పెద్దపేగు, మలాశయ క్యాన్సర్లలో రోబోటిక్ టెక్నాలజీ ద్వారా ట్యూమర్‌ను అత్యంత ఖచ్చితంగా తొలగించవచ్చని తెలిపారు. దీంతో అనేక సందర్భాల్లో శాశ్వత కొలోస్టమీ అవసరం లేకుండా చికిత్స అందించగలుగుతున్నామని చెప్పారు. స్మార్ట్ స్టాప్లర్ సాంకేతికతతో పేగులను మరింత సురక్షితంగా కలపడం సాధ్యమవుతుందని, లీకేజీ ప్రమాదం తగ్గుతుందని వివరించారు. ఛాతీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో కూడా రోబోటిక్ విధానం విస్తృతంగా ఉపయోగపడుతోందన్నారు. గతంలో ఛాతీని పూర్తిగా తెరిచి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు చిన్న రంధ్రాల ద్వారానే శస్త్రచికిత్సలు నిర్వహించడం వల్ల ఆసుపత్రిలో ఉండే రోజులు గణనీయంగా తగ్గుతున్నాయని తెలిపారు. ఫైర్‌ఫ్లై ఫ్లోరోసెన్స్ ఇమేజింగ్ సాంకేతికత ద్వారా ప్రత్యేక డై సహాయంతో క్యాన్సర్ కణజాలం, లింఫాటిక్ మార్గాలను స్పష్టంగా గుర్తించవచ్చని చెప్పారు. దీనివల్ల సెంటినెల్ లింఫ్ నోడ్ మ్యాపింగ్ మరింత ఖచ్చితంగా నిర్వహించగలుగుతున్నామని వివరించారు.

రోగులకు ప్రధాన ప్రయోజనాలు

ఆధునిక రోబోటిక్, ఫ్లోరోసెన్స్ గైడెడ్ శస్త్రచికిత్సల ద్వారా రోగులకు అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని డా. రాజేష్ గౌడ్ తెలిపారు. ముఖ్యంగా—

  • శస్త్రచికిత్స అనంతర నొప్పి తగ్గుతుంది.
  • రక్తనష్టం చాలా తక్కువగా ఉంటుంది.
  • ఆసుపత్రిలో ఉండే రోజులు తగ్గుతాయి.
  • త్వరగా సాధారణ జీవితంలోకి తిరిగి రావచ్చు.
  • శరీరంపై చిన్న మచ్చలే మిగులుతాయి.
  • జీవన నాణ్యత మెరుగుపడుతుంది.
  • కుటుంబ, భావోద్వేగ, ఆర్థిక భారం తగ్గుతుంది.

క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్, ఫ్లోరోసెన్స్ గైడెడ్ టెక్నాలజీలు కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయని, "క్యాన్సర్‌ను నయం చేయడమే కాదు.. రోగి జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చడం కూడా ఆధునిక శస్త్రచికిత్సల ప్రధాన లక్ష్యం" అని డా. రాజేష్ గౌడ్ పేర్కొన్నారు.

Monday, July 27, 2026

వర్షాకాలంలో విద్యుత్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలి

ప్రజలకు రాయికోడ్ పోలీసుల విజ్ఞప్తి

రాయికోడ్, జులై 27 (SNM న్యూస్ ప్రతినిధి): వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల అవకాశాలు అధికంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాయికోడ్ పోలీసు స్టేషన్ ఉపనిరీక్షకుడు సూచించారు. ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాల సమయంలో విద్యుత్ షాక్‌ల వల్ల ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విద్యుత్ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా తెగిపోయిన లేదా నేలపై పడిన విద్యుత్ తీగలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమీపించరాదని, విద్యుత్ స్తంభాలు, మార్పిడి కేంద్రాలు, విద్యుత్ అనుసంధాన పెట్టెల వద్ద నీరు నిల్వ ఉంటే వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అలాగే తడి చేతులతో విద్యుత్ స్విచ్‌లు లేదా విద్యుత్ పరికరాలను తాకకూడదని హెచ్చరించారు. పిల్లలను విద్యుత్ స్తంభాలు, తీగలు, మార్పిడి కేంద్రాల సమీపానికి వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. గృహాల్లో విద్యుత్ వైరింగ్, భూసంబంధిత రక్షణ వ్యవస్థ సక్రమంగా ఉందో లేదో పరిశీలించుకొని, లోపాలు ఉంటే అర్హత కలిగిన విద్యుత్ నిపుణులతోనే మరమ్మతులు చేయించాలని సూచించారు. చెట్లు విద్యుత్ తీగలపై పడినా లేదా తీగలు వాలిపోయినట్లు కనిపించినా వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఉరుములు, మెరుపులు సంభవిస్తున్న సమయంలో విద్యుత్ స్తంభాలు లేదా చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు. ఎవరైనా విద్యుత్ షాక్‌కు గురైనట్లయితే వారిని నేరుగా తాకకుండా ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అనంతరం సహాయక చర్యలు చేపట్టి వెంటనే అత్యవసర వైద్య సేవలు లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ సందర్భంగా రాయికోడ్ పోలీసు స్టేషన్ ఉపనిరీక్షకుడు మాట్లాడుతూ, "ప్రజల ప్రాణ భద్రతే మా ప్రధాన లక్ష్యం. వర్షాకాలంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారితీయవచ్చు. ప్రతి ఒక్కరూ విద్యుత్ భద్రతా నియమాలను పాటించి, ప్రమాదాల నివారణలో పోలీసు, విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలి" అని కోరారు.

ఆషాఢ బోనాల వేడుకల్లో భక్తి పారవశ్యం

రాయికోడ్ ఉరడమ్మ అమ్మవారికి ఘనంగా బోనాల సమర్పణ

రాయికోడ్, జులై 26 (SNM న్యూస్ ప్రతినిధి): సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలోని గ్రామదేవత శ్రీ ఉరడమ్మ అమ్మవారి ఆషాఢ బోనాల మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించిన ఈ మహోత్సవంలో మహిళలు, యువత, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం గ్రామస్థులు డప్పు వాయిద్యాల నడుమ వాగు వద్దకు చేరుకుని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించి తెప్పను నీటిలో వదిలి, అనంతరం పవిత్ర జలాలతో నిండు కుండను ఆలయానికి తీసుకొచ్చారు. ఆ జలాలతో ఉరడమ్మ అమ్మవారికి అభిషేకం నిర్వహించి విశేష పూజలు చేశారు.

తదనంతరం ఉరడమ్మ ఆలయం నుంచి దత్తు గౌడ్ నివాసం వరకు డప్పు వాయిద్యాల మధ్య ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. అక్కడ ప్రత్యేక పూజలు అనంతరం పచ్చికుండలో ఘటాన్ని తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి సంప్రదాయ ఆచారాలను నిర్వహించారు. మహోత్సవం సందర్భంగా ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, పిల్లలు, యువకులు, పెద్దల సంప్రదాయ నృత్యాలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు తలపై బోనాలను మోసుకుంటూ డప్పు వాయిద్యాల నడుమ పురవీధుల గుండా ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి భక్తిపూర్వకంగా సమర్పించారు. మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. గ్రామస్థులు, మహిళలు, యువత, చిన్నారులు విశేష సంఖ్యలో పాల్గొని ఉరడమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందారు. మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో విశేష కృషి చేసిన సేవకులు, దాతలు, నిర్వాహకులను శాలువాలతో ఘనంగా సన్మానించి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎల్లమ్మ తల్లికి ఆషాడమాస భోనాలు


రాయికోడ్, జులై 26: రాయికోడ్ మండల పరిధిలోని మాటూర్ గ్రామంలో ఆదివారం ఆషాడమాసం బోనాలు పురస్కరించుకొని గ్రామంలో కొలువుదీరిన ఎల్లమ్మ తల్లికి బోనాల మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు మహిళలు, ఆడపడుచులు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుల్లతో ఆటపాటలతో గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి రేణుక ఎల్లమ్మ తల్లికి భోనాలు నైవేద్యం సమర్పించారు. అనంతరం అమ్మవారిని భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమం లో గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Sunday, July 26, 2026

బీఆర్ఎస్ కార్యకర్త బసంతికి కన్నీరుమున్నీరుగా వీడ్కోలు

రాయికోడ్, జూలై 25 (SNM న్యూస్): రాయికోడ్ మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కత్తెర బసంతి గుండెపోటుతో మృతి చెందగా, ఆయన అంత్యక్రియలు శనివారం గ్రామంలో విషాద వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ మహబూబ్ పటేల్, రాయికోడ్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు చేవెళ్ల విట్టల్, మండల కార్యదర్శి శంకర్, పార్టీ సీనియర్ నాయకుడు టోపాల రాములు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరై నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా సర్పంచ్ మహబూబ్ పటేల్ మాట్లాడుతూ బసంతి మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటని, ఆయన సేవలను ఎప్పటికీ మరువలేమని అన్నారు. అనంతరం బసంతి కుమారుడు, వార్డు సభ్యుడు సతీష్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అంత్యయాత్రలో సర్పంచ్ మహబూబ్ పటేల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టోపాల రాములు స్వయంగా బసంతి పాడె మోస్తూ భావోద్వేగానికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని బసంతికి తుదివీడ్కోలు పలికారు.

Wednesday, July 08, 2026

కొండాపూర్‌లో ఘనంగా జగ్గారెడ్డి జన్మదిన వేడుకలు-రోగులకు పండ్ల పంపిణీ.. భారీ కేక్ కట్ చేసి సంబరాలు


సంగారెడ్డి ప్రతినిధి, జూలై 7 (SNM NEWS):
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆయన కుమార్తె జయా రెడ్డి జన్మదిన వేడుకలను కొండాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి. మల్లారెడ్డి ఆధ్వర్యంలో కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి జగ్గారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పి. మల్లారెడ్డి మాట్లాడుతూ, జగ్గారెడ్డి ప్రజాసేవలో మరెన్నో సంవత్సరాలు కొనసాగాలని ఆకాంక్షించారు. 
పేదల సంక్షేమానికి ఆయన అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. అనంతరం సంగారెడ్డిలో నిర్వహించిన ప్రధాన జన్మదిన వేడుకలకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జగ్గారెడ్డికి పూలగుచ్ఛాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, కొండాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి మల్లారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగ్గారెడ్డి జన్మదిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sunday, July 05, 2026

గంగారాం గ్రామంలో వైభవంగా శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం


-ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి

-ఆలయ అభివృద్ధికి రూ.5 లక్షల విరాళం 

–ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందిన నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి,  జూలై 5 (SNM న్యూస్):

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గంగారాం గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో, వేదమంత్రోచ్చారణల నడుమ వైభవంగా నిర్వహించారు. మూడు రోజులపాటు సాగిన ఈ మహోత్సవాల్లో గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. గ్రామస్థులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహోత్సవాల్లో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, వాస్తు హోమం, నవగ్రహ హోమం, వివిధ వైదిక యాగాలు, మహా పూర్ణాహుతి, కుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ఠాపన, మహామంగళహారతి, తీర్థప్రసాద పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదఘోషలు, మంగళవాయిద్యాల మధ్య జరిగిన ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పుణ్య కార్యక్రమానికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఆహ్వానించి సాంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణానికి తీసుకెళ్లారు. అనంతరం నిర్మల జగ్గారెడ్డి శ్రీ ఆంజనేయస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా జీవించాలని, గ్రామ ప్రజలందరికీ ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం కలగాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహాయంగా రూ.5 లక్షల విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లో ఆలయాలు కేవలం ఆరాధనా కేంద్రాలు మాత్రమే కాకుండా సామాజిక ఐక్యతకు, సనాతన ధర్మ పరిరక్షణకు, యువతలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడానికి కేంద్ర బిందువులుగా నిలుస్తాయని అన్నారు. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు గ్రామాల్లో సోదరభావాన్ని, సామాజిక సమైక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ధార్మిక సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు భావితరాలకు వాటిని అందించాలని పిలుపునిచ్చారు. మూడు రోజులపాటు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. మహోత్సవాల సందర్భంగా గ్రామంలో భక్తి సంగీత కార్యక్రమాలు, హరినామ సంకీర్తనలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, గొల్లపల్లి సహకార సంఘం చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాలను విజయవంతం చేశారు.

అంగరంగ వైభవంగా సొంతం సూర్యకాంత్ పదవీ విరమణ సన్మానోత్సవం

సంగారెడ్డి, జూలై 5 (SNM NEWS): సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఉద్యోగుల సంఘం, సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దేముల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సొంతం సూర్యకాంత్ పదవీ విరమణ అభినందన సన్మానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానుల సమక్షంలో కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సొంతం సూర్యకాంత్ ప్రభుత్వ సేవలో సుదీర్ఘకాలం నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు, ఉద్యోగులకు విశేష సేవలు అందించారని కొనియాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా నిరంతరం కృషి చేశారని, ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ ముఖ్య అతిథిగా హాజరై సూర్యకాంత్‌ను ఘనంగా సన్మానించి శాలువా, జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు. వికారాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, సహోద్యోగులు పాల్గొని ఆయన సేవలను ప్రశంసించారు. సూర్యకాంత్‌తో కలిసి పనిచేసిన సహోద్యోగులు ఆయన సేవా ప్రస్థానాన్ని స్మరించుకుంటూ అనేక మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. ఉద్యోగ జీవితంలో ఆయన చూపిన నిబద్ధత, సహృదయత, పరిపాలనా నైపుణ్యం యువ ఉద్యోగులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా పదవీ విరమణ అనంతర జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పుష్పాభిషేకాలు, శాలువాలతో సన్మానాలు, జ్ఞాపికల ప్రదానం, అభినందనల మధ్య పదవీ విరమణ మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ సొంతం సూర్యకాంత్‌కు ఘనంగా వీడ్కోలు పలుకుతూ ఆయన చేసిన సేవలను చిరకాలం గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు.

సంగారెడ్డిలో ఉచిత మెగా వైద్య శిబిరం – రక్తదాన శిబిరానికి విశేష స్పందన

సంగారెడ్డి, జూలై 5 (SNM NEWS): ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో సంగారెడ్డిలోని సాహితి ఆసుపత్రి ఆధ్వర్యంలో సాహితీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ రాము జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించి ఘనంగా జన్మదిన వేడుకలు జరిపించారు. అనంతరం ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో  ఆదివారం ఉచిత నాడీ సంబంధిత వ్యాధులు, ఎముకలు–కీళ్ల వ్యాధులు, మధుమేహ వ్యాధుల నిర్ధారణ బృహత్ వైద్య శిబిరంతో పాటు స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య నిపుణుల సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నాడీ సంబంధిత వ్యాధులు, ఎముకలు–కీళ్ల వ్యాధులు, సాధారణ వైద్యం, మధుమేహ చికిత్స విభాగాలకు చెందిన నిపుణులు రోగులను పరీక్షించి తగిన వైద్య సలహాలు అందించారు. పక్షవాతం, వెన్నునొప్పి, మెడనొప్పి, మూర్ఛ వ్యాధి, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, మధుమేహం, నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి చికిత్సకు సంబంధించిన సూచనలు చేశారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే సులభంగా నియంత్రించవచ్చని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు నిత్య వ్యాయామం చేయాలని వైద్యులు సూచించారు. మధుమేహంతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం పలు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఎముకలు–కీళ్ల శస్త్రచికిత్సలపై ఇరవై శాతం, ప్రయోగశాల పరీక్షలపై యాభై శాతం, మందులపై పదిహేను శాతం తగ్గింపు కల్పిస్తున్నట్లు తెలిపింది. అలాగే నరాల పనితీరును నిర్ధారించే పరీక్షలు, మెదడు విద్యుత్ తరంగాల పరీక్షలు, గత మూడు నెలల రక్తంలో చక్కెర స్థాయిని తెలియజేసే పరీక్షలను కూడా రాయితీ ధరలకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి యువత, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజలు విశేషంగా స్పందించి రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన రోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు నిర్దిష్ట వ్యవధిలో స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. బృహత్ వైద్య శిబిరం ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు, స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న ప్రజలు వైద్య సేవలను, ఆసుపత్రి అందించిన రాయితీలను అభినందిస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

36 ఏళ్ల విశిష్ట సేవలకు ముగింపు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి పల్గటి మాణిక్యం - ప్రవీణ కు ఘన సన్మానం

మెదక్, జూలై 4 (ప్రతినిధి): మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సుదీర్ఘకాలం సేవలందించిన ఉద్యోగి పల్గటి మాణిక్యం ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించారు. 1990 మే 10న ఉద్యోగంలో చేరిన ఆయన సుమారు 36 సంవత్సరాలపాటు అంకితభావంతో, క్రమశిక్షణతో, నిజాయితీతో విధులు నిర్వర్తించి, 2026 జూన్ 30న పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభకు టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పల్గటి మాణిక్యం ప్రవీణ దంపతులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘకాలం ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేసిన ఆయన సేవలను కొనియాడిన ఆమె, పదవీ విరమణ అనంతరం వారి జీవితమంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందోత్సాహాలతో శేష జీవితాన్ని గడపాలని అభిలషించారు. సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో కుటుంబ అభ్యున్నతితో పాటు సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేసి ఆదర్శ ఉద్యోగిగా గుర్తింపు పొందిన పల్గటి ప్రవీణ్ సేవలను కుటుంబ సభ్యులు ప్రశంసించారు. ఆయన పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తెలు పి. శిరీష, పి. సహజ, కుమారుడు పి. తరుణ్, అల్లుడు సైమన్ అరోనోయల్, మనుమడు వంశీకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని పల్గటి మాణిక్యం- ప్రవీణకు ఘనంగా అభినందనలు తెలిపారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...