Friday, October 02, 2026

గాంధీ విగ్రహానికి జర్నలిస్టుల సమస్యలపై వినతి..!

-ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి డిమాండ్

సంగారెడ్డి అక్టోబర్ 2 (SNM న్యూస్):

 గాంధీ జయంతి సందర్భంగా జాతీయ జర్నలిస్టుల డిమాండ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. మీడియా రంగాన్ని సమగ్రంగా సమీక్షించి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విధాన సిఫారసులు చేసేందుకు సమగ్ర మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, మీడియా సిబ్బంది, వార్తా సంస్థలను దాడులు, బెదిరింపులు, అణచివేత నుంచి రక్షించేందుకు ప్రత్యేక కేంద్ర చట్టం తీసుకురావాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన 1955, 1958 చట్టాల నిబంధనలను పునరుద్ధరించి ఉద్యోగ భద్రత, పని గంటల పరిమితి, వివాదాల పరిష్కారం, ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ఉద్యోగులకు పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు అందించేందుకు కొత్త వేతన బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని, సంగారెడ్డి జిల్లాలోనూ అర్హులైన ప్రతి జర్నలిస్టుకు స్థలం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు ఆరోగ్య సేవలను పునరుద్ధరించి, తక్షణమే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అక్రిడిటేషన్ కార్డులు అందని అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు జారీ చేయాలని ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వాలు స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర నాయకుడు జోగిపేట యాదగిరి, వెంకటరెడ్డి

సంఘం జిల్లా కోశాధికారి అన్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, శ్రీనాథ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ విల్సన్, ఉలవల రాజు, అంజయ్య,

జాయింట్ సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి, సుమన్,

చిన్న మధ్యతరహా పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధిక్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చవాన్, కోశాధికారి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు నజీర్,

సీనియర్ జర్నలిస్టు మధుసూదనాచారి,

 రథసారథి సీఈవో సంతోష్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు విజయరాజు, పరంజ్యోతి, నాగరాజుగౌడ్,

ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్, ఇతర నేతలు సంతోష్, సత్యం, సాక్ష్యం శ్రీనివాస్, నవీన్, పటాన్చెరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పత్తి నరసింహ ప్రధాన కార్యదర్శి యాదగిరి, బొల్లారం నాయుడు, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, September 30, 2026

సంగారెడ్డిలో నిర్మల జగ్గారెడ్డి పర్యటన-ప్రైడ్‌ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాల ప్రారంభం

సంగారెడ్డి ప్రతినిధి: మాజీ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మంగళవారం సంగారెడ్డి పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని అంబేద్కర్‌ క్రీడా మైదానంలో నిర్వహించిన జాతీయ స్థాయి అంతర్‌జిల్లా అథ్లెటిక్స్‌ పోటీలకు క్రీడాకారుల ఎంపిక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు.

జాతీయ స్థాయి అంతర్‌జిల్లా అథ్లెటిక్స్‌ పోటీలకు సంగారెడ్డి జిల్లా నుంచి ఎంపికైన క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను నిర్మల జగ్గారెడ్డి పరిశీలించారు. నవంబర్‌ 14, 16 తేదీల్లో వోక్సెన్‌లో జరగనున్న పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బంగారు, వెండి, కాంస్య పతకాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం అధ్యక్షుడు సోహైల్‌ అలీ, కార్యదర్శి జావిద్‌ అలీ, రవి, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రైడ్‌ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాల ప్రారంభం

సంగారెడ్డి పట్టణంలోని ప్రైడ్‌ ఆసుపత్రిలో నూతన వైద్య పరికరాలను నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో గుండె ఆగిపోయిన రోగులకు ఛాతీపై ఒత్తిడి అందించేందుకు ఉపయోగించే యాంత్రిక హృదయ-ఊపిరితిత్తుల పునరుద్ధరణ పరికరాన్ని ఆమె ఆవిష్కరించారు. అలాగే గుండె రక్తనాళాల్లోని అడ్డంకుల పరిమాణాన్ని గుర్తించేందుకు ఉపయోగపడే ఆధునిక వైద్య పరికరాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ఆధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రులు ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జార్జ్‌ మాథ్యూస్‌, వైద్యులు డాక్టర్‌ అనిల్‌, నాయకులు ప్రవీణ్‌, కూన వేణు తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల హక్కుల కోసం ..అక్టోబర్ 2 న గాంధీ జయంతి నాడు నిరసన !

జర్నలిస్టుల హక్కుల కోసం ..అక్టోబర్ 2 న గాంధీ జయంతి నాడు నిరసన !
ఆరు డిమాండ్లపై తక్షణ జోక్యం అవసరం 

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ 

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి

సంగారెడ్డి సెప్టెంబర్  30 (రథసారథి న్యూస్):
జర్నలిస్టుల హక్కులను సాధించడానికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ( ఐజేయు) పిలుపుమేరకు అక్టోబర్ 2 న గాంధీ జయంతి నాడు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో 
నిరసన కార్యక్రమం చేపట్టినట్లు టి యు డబ్ల్యూ జే సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ అనిల్ కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా విభాగం అధ్యక్షుడు ఆసిఫ్, ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్, చిన్న మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడు సిద్ధిక్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చవాన్
తెలిపారు. డిమాండ్స్ డే లో భాగంగా జాతిపిత గాంధీజీ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి చెప్పారు.
ఇటీవల బెంగళూరు లో నిర్వహించిన ఐజేయు కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం
ప్రదర్శించడంపై సమావేశం ఖండించిందని అన్నారు.
 పెద్ద ఎత్తున నిరసన తెలిపాలని నిర్ణయించిందన్నారు. బెంగళూరు సమావేశంలో చేసిన తీర్మానం మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి నాడు ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే ఫైసల్ తో పాటు జిల్లాలోని జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొంటారని  యాదగిరి అన్నారు. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్ కు, స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు.
 ప్రధాన డిమాండ్లు ఈ కింది విధంగా ఉన్నాయని  వివరించారు.ముఖ్యంగా నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి.మీడియా సిబ్బందికి  రక్షణ కల్పించాలి.అందుకు ప్రత్యేక చట్టం తేవాలి. 
రద్దు చేయబడిన చట్టాల స్థానంలో చట్టబద్దంగా హక్కులు పునరుద్ధరించాలి.
నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి.
రాష్ట్రంలో ఇళ్లస్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలి. 
జర్నలిస్టుల భద్రతా కోసం చట్టం తేవాలి అని యాదగిరి డిమాండ్ చేశారు. మీడియా నిపుణులు ఎదుర్కొంటున్న కీలకమైన నిర్మాణాత్మక  చట్టపరమైన సమస్యలపై తక్షణం కేంద్రం జోక్యం కోరుతున్నామన్నారు. గౌరవనీయ రాష్ట్రపతి ఈ విషయంలో స్పందించాల్సిందిగా తమ సంఘం కోరుతుందన్నారు.పత్రికా స్వేచ్ఛను,మీడియా కార్మికుల సామాజిక-ఆర్థిక భద్రతను పరిరక్షించడానికి కీలకమైన ఆరు ముఖ్యమైన డిమాండ్లను కేంద్రం వెంటనే పరిష్కరించాలని యాదగిరి డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు, ఇళ్లస్థలాలు ఇవ్వాలి. 
 ఉద్యోగులకు ఇస్తున్న విధంగా హెల్త్ కార్డులు ఇచ్చి,క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాలని టీయూడబ్ల్యూజే కోరుతోందని యాదగిరి పేర్కొన్నారు.

Sunday, September 20, 2026

శ్వాసకోశ వ్యాధులకు సమగ్ర వైద్య సేవలు -ఘనంగా జియాన్ చెస్ట్ కేర్ రెండో వార్షికోత్సవం

సంగారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 19 (SNM న్యూస్): శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఆధునిక వైద్య సేవలను అందిస్తున్న జియాన్ చెస్ట్ కేర్ రెండో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్‌ కె.సువర్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వైద్య కేంద్రం ద్వారా ఆస్తమా, అలర్జీ, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి (సీఓపీడీ), నిద్ర సంబంధిత సమస్యలు, న్యూమోనియా, ఊపిరితిత్తుల వ్యాధులు, దీర్ఘకాలిక దగ్గు, క్షయ, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, బ్రాంకైటిస్‌, ప్లూరల్‌ ఎఫ్యూషన్‌ తదితర వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే ధూమపానం మాన్పించేందుకు ప్రత్యేక సలహాలు, ఊపిరితిత్తుల పునరావాసం, వయోజనులకు ఫ్లూ, న్యూమోకాకల్‌ టీకాలు వంటి సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలో నిద్ర పరీక్ష, కఫ పరీక్షలు, పీఎఫ్‌టీ, ఈసీజీ, ఎఫ్‌ఎన్‌ఏసీ, బ్రాంకోస్కోపీ తదితర పరీక్షలతో పాటు ప్రయోగశాల, ఔషధ కేంద్రం సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెండేళ్లుగా ప్రజలకు నాణ్యమైన శ్వాసకోశ వైద్య సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్న జియాన్‌ చెస్ట్‌ కేర్‌ భవిష్యత్తులోనూ మరింత విస్తృతమైన సేవలను అందించేందుకు కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యులు, సిబ్బంది, శుభాకాంక్షలు తెలిపిన రోగులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Saturday, September 19, 2026

విద్యారంగ సమస్యల పరిష్కారానికి USFI సమరశంఖం

-సంగారెడ్డిలో 3 వేల మంది విద్యార్థులతో యూఎస్‌ఎఫ్‌ఐ భారీ ర్యాలీ

-పెండింగ్‌ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలి

సంగారెడ్డి, సెప్టెంబరు 19 (SNM న్యూస్):

విద్యారంగ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యాసంస్థల పరిరక్షణ, విద్యార్థుల హక్కుల సాధన కోసం యూఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్లీనరీ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు 3 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. విద్యార్థుల నినాదాలతో సంగారెడ్డి పట్టణం మార్మోగింది. సభకు యూఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్‌, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాదం తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి తాటికొండ రవి, జాతీయ సలహాదారు మాదంశెట్టి అరుణ్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ విద్యారంగ పరిస్థితులు, ఉన్నత విద్యలో ఎదురవుతున్న ఇబ్బందులపై వారు ప్రసంగించారు.

-ప్రభుత్వ విద్యకు నిధులు పెంచాలిఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యారంగానికి తగినన్ని నిధులు కేటాయించకుండా ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. ఒకవైపు కార్పొరేట్‌ సంస్థలకు భారీ మొత్తంలో రుణ మాఫీలు, వివిధ రకాల ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతున్నాయని, మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మౌలిక వసతుల కొరతను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థలకు తగిన నిధులు కేటాయించి తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, వసతి గృహాలు, బోధనా సిబ్బంది వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని డిమాండ్‌ చేశారు. విద్య ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని కోరారు.


-రూ.10 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలితెలంగాణలో విద్యార్థులకు సంబంధించిన పెండింగ్‌ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. నిధుల విడుదలలో జాప్యం కారణంగా విద్యార్థులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ప్రభుత్వం తక్షణమే ఉపశమనం కల్పించాలని కోరారు.

-విద్యార్థుల స్థానికతపై స్పష్టత ఇవ్వాలివైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన స్థానికత నిబంధనలపై కూడా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో నాలుగేళ్ల విద్యాభ్యాసాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. స్థానిక విద్యార్థుల ప్రయోజనాలను కాపాడే విధంగా నిబంధనలను సమీక్షించాలని డిమాండ్‌ చేశారు. జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని, ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

-ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రభుత్వ విశ్వవిద్యాలయం

తెలంగాణలోని ప్రతి ఉమ్మడి జిల్లాకు కనీసం ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని యూఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. గ్రామీణ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలంటే ప్రభుత్వ విద్యాసంస్థల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే విద్యార్థులు, ప్రజలను సమీకరించి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

-వందలాది మంది ప్రతినిధుల హాజరుఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు నార్ల చంద్రశేఖర్‌, మోర్తాల చందర్రావుతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు చందులాపురం మధు, రాజేష్‌, గణేష్‌, వెంకటేష్‌, మిట్టపల్లి తిరుపతి, సహాయ కార్యదర్శులు గుడికందుల రవి, నాచారం శేఖర్‌, ఎండీ పాషా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వందలాది మంది ప్రతినిధులు, వేలాది మంది విద్యార్థులు ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొన్నారు.

Monday, September 14, 2026

మట్టి గణపతిని పూజించడం ప్రకృతి పరిరక్షణకు ప్రతీక -మహేశ్వర శర్మ సిద్ధాంతి

-వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 5,250 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

సంగారెడ్డి ప్రతినిధి(SNM న్యూస్): పర్యావరణ పరిరక్షణతో పాటు సనాతన ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంగారెడ్డిలోని ‘వాసవి మా ఇల్లు’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పట్టణంలోని ఐబీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్‌ మహేశ్వర శర్మ సిద్ధాంతి భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వాసవి మా ఇల్లు’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తోపాజి అనంత కిషన్‌ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది 5,250 మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు అందజేయడం గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రకృతి నుంచి లభించే సహజ పదార్థాలతో గణనాథుడి ప్రతిమను రూపొందించి పూజించడం సనాతన ధర్మంలో భాగమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మట్టి గణనాథుల పంపిణీ కార్యక్రమం ప్రజల్లో భక్తిభావంతో పాటు ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంచుతోందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించి గణేశ్వరుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం సంస్థ వ్యవస్థాపకులు తోపాజి అనంత కిషన్‌, ప్రధాన కార్యదర్శి పుల్లూరి ప్రకాశ్‌, ఉపాధ్యక్షుడు మ్యాడం రాధాకిషన్‌, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్‌, సభ్యులు చందా శ్రీధర్‌, ఇరుకుల ప్రదీప్‌కుమార్‌, జూలకంటి రామకృష్ణ, వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అనుముల సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Sunday, September 13, 2026

మియాపూర్‌లో ఘనంగా క్లారా బ్రైడల్ స్టూడియో ప్రారంభం


మియాపూర్: మియాపూర్ మెట్రో సమీపంలోని కెల్వరీ టెంపుల్ మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్లారా బ్రైడల్ స్టూడియో ప్రారంభోత్సవం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. బిగ్‌బాస్ విజేత కల్యాణ్ పడాల ముఖ్య అతిథిగా హాజరై స్టూడియోను ప్రారంభించారు. బిగ్‌బాస్ ఫేమ్ టేస్టీ తేజ, అగ్నిపరీక్ష ఫేమ్ రామకృష్ణ ప్రత్యేక అతిథులుగా పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖుల రాకతో ప్రారంభోత్సవ ప్రాంగణంలో సందడి నెలకొంది. స్థానికులు, అభిమానులు, అందాల అలంకరణ, వస్త్రాలంకరణ రంగాలకు చెందిన పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, ఆధునిక మహిళల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన వధువు అలంకరణ, అందాల సేవలను ఒకేచోట అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. క్లారా బ్రైడల్ స్టూడియో ప్రజల ఆదరణ పొందుతూ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వధువు అలంకరణతో పాటు అందాల సంరక్షణ, వస్త్రాలంకరణకు సంబంధించిన వివిధ సేవలను నిపుణుల ఆధ్వర్యంలో ఒకేచోట అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవానికి హాజరై ప్రోత్సహించిన అతిథులు, శ్రేయోభిలాషులు, వినియోగదారులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గాంధీ విగ్రహానికి జర్నలిస్టుల సమస్యలపై వినతి..!

-ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి డిమాండ్ సంగారెడ్డి అక్టోబర్ 2 (SN...