Monday, June 22, 2026

ఏవీఎన్‌ఎల్–ఓఎఫ్‌ఎంకేలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

 


ఎద్దుమైలారం, జూన్ 21: ఎద్దుమైలారంలోని ఏవీఎన్‌ఎల్–ఓఎఫ్‌ఎంకే ఎస్టేట్ పరిధిలోని శరత్ యోగా కేంద్రంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏవీఎన్‌ఎల్–ఓఎఫ్‌ఎంకేకు చెందిన అధికారులు, ఉద్యోగులు, నివాసితులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, జేసీఎం, వర్క్స్ కమిటీ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన జనరల్ మేనేజర్ ఎస్.ఎస్. ప్రసాద్, సీఎజీఎం (ఐఓఎల్) కె. విజయ్ దత్, ఏవీఎన్‌ఎల్ అధికారులతో పాటు డబ్ల్యూడబ్ల్యూఏ అధ్యక్షురాలు రంజనా ప్రసాద్, ఆమె బృందం, కార్మిక సంఘాలు, జేసీఎం, వర్క్స్ కమిటీ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు మరియు ఓఎఫ్‌ఎంకే ఎస్టేట్ నివాసితుల సహకారం, భాగస్వామ్యానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. యోగా గురువు నర్సింగ్ కేతావత్, పీఆర్ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమం పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని నింపింది. శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతగానో దోహదపడుతుందని వారు వివరించారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ అయిన “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా” సందేశాన్ని ప్రతిబింబిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవన విధానానికి మార్గదర్శకంగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Sunday, June 21, 2026

ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలి

 


ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని బీఆర్ఎస్‌వీ డిమాండ్

సంగారెడ్డి, జూన్ 21: మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, వాటిని వెంటనే నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్‌వీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ, పాఠశాల యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజులు పెంచి తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్‌వీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఇతర ప్రాథమిక సౌకర్యాల కొరతను వెంటనే గుర్తించి పరిష్కరించాలని అధికారులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుని విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌వీ నాయకులు అఖిల్, రాజు, విజయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

రూ.500 కోట్లతో కింది బజార్ చెరువు సుందరీకరణకు ప్రణాళికలు


పనుల పురోగతిని పరిశీలించిన జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, హెచ్‌ఎండీఏ, ఆర్థిక, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు

సంగారెడ్డి జూన్ 20: సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్ చెరువును రూ.500 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రణాళికలకు మరింత వేగం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సంబంధిత శాఖల అధికారులతో కలిసి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువు అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు, చేపట్టాల్సిన పనులపై విస్తృతంగా చర్చించారు. సుమారు కిలోమీటరున్నర పొడవున ఉన్న చెరువు కట్టను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయడం, నెక్లెస్ రోడ్ నిర్మాణం, పార్కుల ఏర్పాటు, ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దే అంశాలపై అధికారులతో సమీక్షించారు. సంగారెడ్డి పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చే సందర్శకులను ఆకట్టుకునే విధంగా కింది బజార్ చెరువును అభివృద్ధి చేయాలని జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగేలా అవసరమైన ప్రతిపాదనలు, పరిపాలనా ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లలో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సమీక్ష సమావేశం అనంతరం జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి సంబంధిత అధికారులతో కలిసి కింది బజార్ చెరువు కట్ట ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా అలుగు సమీపంలోని ప్రభుత్వ భూములను సందర్శించి, వివిధ అభివృద్ధి పనులు చేపట్టాల్సిన ప్రాంతాలను గుర్తిస్తూ అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు అమలులో నాణ్యతతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

 

సంగారెడ్డి జూన్ 20: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు చేసిన వ్యాఖ్యలు రైతుల నడ్డి విరిచేలా ఉన్నాయని విమర్శించారు. కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే ధాన్యం కొనుగోలు చేస్తామని, అదనంగా ఒక్క గింజ కూడా కొనబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం రైతులకు తీవ్ర అన్యాయమని అన్నారు. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టి, రైతుల జీవితాలను కష్టాల్లోకి నెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పదేళ్లపాటు ధైర్యంగా వ్యవసాయం చేసిన రైతులను మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితుల్లోకి నెట్టేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని చింతా ప్రభాకర్ తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా 11 విడతల్లో రూ.72 వేల కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని, రైతు బీమా పథకం ద్వారా రైతు కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించామని చెప్పారు. రైతు రుణమాఫీ కోసం రూ.29 వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.6,800 కోట్లు ఖర్చు చేశామని, మొత్తంగా రైతుల ఖాతాల్లో లక్ష కోట్లకు పైగా నేరుగా జమ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించి దేశంలో ఆదర్శంగా నిలిచామని అన్నారు. రైతును కేంద్రబిందువుగా చేసుకుని అమలు చేసిన విధానాల వల్ల తెలంగాణలో వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు. 2014కు ముందు కోటి 31 లక్షల ఎకరాలుగా ఉన్న పంట విస్తీర్ణం 2023 నాటికి 2 కోట్ల 30 లక్షల ఎకరాలకు పెరిగిందని చెప్పారు. బీడు భూములు పచ్చని మాగాణాలుగా మారాయని, తెలంగాణ దేశానికే ఆహార ధాన్య ఉత్పత్తిలో కీలక రాష్ట్రంగా ఎదిగిందని పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా ఏడు వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు వద్దే చివరి గింజ వరకు కొనుగోలు చేశామని, వరితో పాటు మొక్కజొన్న, జొన్న, శనగ, కందులు, పెసలు, సన్‌ఫ్లవర్, సోయాబీన్ వంటి పంటలను కూడా కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్‌లో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని చింతా ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వం రావాలనే భావన ప్రజల్లో బలపడుతోందని, రాష్ట్ర సంపదను ఢిల్లీకి తరలించడమే ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు. అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రైతుల భూములను భయపెట్టి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని మంత్రులు, జిల్లా కలెక్టర్‌ను కలిసి కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి నిధులను కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని, కొత్త నిధులు తీసుకురాకుండా ప్రచారానికే పరిమితమవుతోందని చింతా ప్రభాకర్ విమర్శించారు. అక్రమ నిర్మాణాలు, పేదల భూముల ఆక్రమణలను సహించబోమని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, విఠల్, నాయకులు శ్రీధర్ రెడ్డి, గోవర్ధన్ నాయక్, సాబేర్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, June 20, 2026

గొల్లగూడంలో నూతన చాయ్ బంక్ కేఫ్ ప్రారంభం ప్రారంభించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

 

సంగారెడ్డి, జూన్ 20: సంగారెడ్డి పట్టణంలోని గొల్లగూడం గణేష్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన చాయ్ బంక్ కేఫ్ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఫ్ నిర్వాహకులు సాయికృష్ణ, దశరథ్, అశోక్, ప్రశాంత్, శేఖర్‌లతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్థానిక ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేఫ్ నిర్వాహకులు మాట్లాడుతూ, వినియోగదారులకు పరిశుభ్రమైన వాతావరణంలో అత్యుత్తమ నాణ్యతతో చాయ్, కాఫీతో పాటు ఇతర పానీయాలను అందుబాటు ధరల్లో అందిస్తామని తెలిపారు. వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Wednesday, June 17, 2026

టాలెంట్ టెస్ట్ విజేతలకు నగదు బహుమతుల ప్రదానం

 

-నాణ్యమైన విద్యతో విద్యార్థుల్లో సమగ్ర వికాసమే లక్ష్యం

-కృష్ణవేణి హైస్కూల్ ప్రిన్సిపల్ కృపానిధి పరీదా

సంగారెడ్డి : విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భాషా నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసాన్ని అందించాలనే లక్ష్యంతో కృపానిధి కృష్ణవేణి హైస్కూల్ వినూత్న విద్యా విధానాలను అమలు చేస్తోందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. 2026–27 విద్యా సంవత్సరానికి నర్సరీ నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై పట్టు పెంపొందించేందుకు ఐఎల్టీఎస్ ఇంగ్లీష్, ఫోనిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఫ్లూయెన్సీ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ ఇంగ్లీష్, కాలిగ్రఫీ, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, వ్యాకరణ నైపుణ్యాలు, పదజాల అభివృద్ధి వంటి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. భవిష్యత్ పోటీ ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించింది. అత్యాధునిక డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్‌లు, రోబోటిక్స్ శిక్షణ, కంప్యూటర్ విద్య, స్కేటింగ్, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కార్యాచరణ ఆధారిత బోధన ద్వారా విద్యార్థులకు సమగ్ర విద్యను అందిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. అలాగే తల్లిదండ్రుల కోసం ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులను కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది. 




విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ఉద్దేశంతో జూన్ 10న నిర్వహించిన స్కాలర్‌షిప్ టాలెంట్ టెస్ట్–2026కు విశేష స్పందన లభించిందని పేర్కొంది. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులను ప్రదానం చేశారు. విజేతలు ప్రథమ బహుమతి: నాగ అనీష్ వేద నిమిత్రూ – రూ.15,000, ద్వితీయ బహుమతి: కే. యశ్వంత్ – రూ.10,000, తృతీయ బహుమతి: కే. నవదీప్ చారి – రూ.5,000  అదనంగా, టాలెంట్ టెస్ట్‌లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పరీక్ష సందర్భంగా విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు బోటింగ్, బబుల్ హౌస్, అమ్యూజ్‌మెంట్ గేమ్స్, వినోదాత్మక పోటీలు, సృజనాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో చిన్నారులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ, పుస్తక విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, భాషా ప్రావీణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, నైతిక విలువలు కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం అని పేర్కొంది. ప్రవేశాలు పరిమిత సీట్లతో కొనసాగుతున్నందున, ఆసక్తి గల తల్లిదండ్రులు ముందస్తుగా తమ పిల్లలను నమోదు చేసుకోవాలని కృపానిధి కృష్ణవేణి పాఠశాల ప్రిన్సిపల్ కృపానిధి పరీదా విజ్ఞప్తి చేసారు.

Tuesday, June 16, 2026

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి

 


సమ్మె పరిష్కారానికి కృతజ్ఞతలు తెలిపిన విశ్రాంత ఉద్యోగుల సంఘం.. పెండింగ్ బకాయిలు, వైద్య సదుపాయాలపై ప్రత్యేక విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 16: ఏప్రిల్ 23, 24, 25 తేదీల్లో జరిగిన కార్మికుల సమ్మెను సత్వరమే పరిష్కరించి, సమ్మె విరమణకు కృషి చేసిన యాజమాన్యానికి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. అదే సమయంలో విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వినతిపత్రం ద్వారా కోరింది. సంఘం ప్రధానంగా 2013 పీఆర్సీ యాజమాన్య కాంట్రిబ్యూషన్ బకాయిలను బర్కత్‌పుర పీఎఫ్ కార్యాలయంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీంతో ఉద్యోగుల పీఎఫ్ పెన్షన్ పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది. అలాగే, 2017 పీఆర్సీని విశ్రాంత ఉద్యోగులకు అమలు చేసి, దాదాపు ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరింది. ఇదే విధంగా 2021 పీఆర్సీ ఒప్పందం ప్రకారం విశ్రాంత ఉద్యోగులకు కూడా వర్తింపజేసి, వారికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని, అలాగే 2026 ఏప్రిల్ వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరికీ అన్ని బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేసింది.

సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి

సూపర్ లగ్జరీ సర్వీసుల్లో విశ్రాంత ఉద్యోగి, ఆయన జీవిత భాగస్వామికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సంఘం కోరింది.

వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలని విజ్ఞప్తి

తార్నాక ఆసుపత్రిలో గతంలో రెండు నెలలకు సరిపడా మందులు ఒకేసారి అందించేవారని, ప్రస్తుతం నెలనెలా మాత్రమే ఇస్తుండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వృద్ధ విశ్రాంత ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని సంఘం తెలిపింది. అందువల్ల పాత విధానాన్ని పునరుద్ధరించి, రెండు నెలల మందులను ఒకేసారి అందించాలని కోరింది. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆసుపత్రుల్లోనూ అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు సభ్యత్వం పొందలేకపోయిన విశ్రాంత ఉద్యోగులకు తార్నాక ఆసుపత్రి మెంబర్షిప్ పొందేందుకు మరో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.


మెడికల్ అన్‌ఫిట్, వీఆర్‌ఎస్ ఉద్యోగుల కుటుంబాలకు దహన సంస్కార సహాయం ఇవ్వాలి

ఆర్టీసీలో సేవలందించి రిటైర్ అయిన ఉద్యోగి మరణించినప్పుడు అందించే రూ.30 వేల దహన సంస్కార సహాయాన్ని, వైద్య కారణాలతో ఉద్యోగ విరమణ చేసిన (మెడికల్ అన్‌ఫిట్) ఉద్యోగులు, స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) తీసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు కూడా వర్తింపజేయాలని సంఘం కోరింది.

విశ్రాంత ఉద్యోగులకు రెస్ట్‌రూమ్ సదుపాయం కల్పించాలి

బయటి జిల్లాల నుంచి చికిత్స కోసం తార్నాక ఆసుపత్రికి వచ్చే విశ్రాంత ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్న సంఘం, సీబీఎస్ లేదా జేబీఎస్‌లోని విశ్రాంతి గదుల్లో కనీసం నాలుగు పడకల సౌకర్యాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.

తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పై సమస్యలన్నింటినీ మానవతా దృక్పథంతో పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ యాజమాన్యాన్ని కోరింది. ఉద్యోగ జీవితమంతా సంస్థ అభివృద్ధికి సేవలందించిన విశ్రాంత ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేసింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ రాజయ్య, స్టేట్ జనరల్ సెక్రెటరీ బుచ్చిరెడ్డి, రీజినల్ ప్రెసిడెంట్ పి, రీజినల్ చైర్మన్ సత్యనారాయణ, రీజినల్ జనరల్ సెక్రెటరీ బి.కృష్ణమూర్తి, స్టేట్ జాయింట్ సెక్రెటరీ మురళీధర్, ఫారుక్, మారుతి, చీఫ్ అడ్వైజర్ వి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ గంగారం, ఆంజనేయులు, ఈశ్వరయ్య, బీర్బల్, జాయింట్ సెక్రెటరీ సుధాకర్, కిష్టయ్య, నరసింహులు, జనార్ధన్, ట్రెజరర్ బాలరాజు, పబ్లిసిటీ సెక్రటరీ వంటప్ప, దేవదానం, శివకుమార్, సంగారెడ్డి డిపో చైర్మెన్ కె.నవాజ్ . దుర్గారాములు, రాజిరెడ్డి , జి.నర్సిములు, పి.వి.గౌడ్ జీఆర్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...