సంగారెడ్డి జూన్ 20: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు చేసిన వ్యాఖ్యలు రైతుల నడ్డి విరిచేలా ఉన్నాయని విమర్శించారు. కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే ధాన్యం కొనుగోలు చేస్తామని, అదనంగా ఒక్క గింజ కూడా కొనబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం రైతులకు తీవ్ర అన్యాయమని అన్నారు. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టి, రైతుల జీవితాలను కష్టాల్లోకి నెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పదేళ్లపాటు ధైర్యంగా వ్యవసాయం చేసిన రైతులను మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితుల్లోకి నెట్టేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని చింతా ప్రభాకర్ తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా 11 విడతల్లో రూ.72 వేల కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని, రైతు బీమా పథకం ద్వారా రైతు కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించామని చెప్పారు. రైతు రుణమాఫీ కోసం రూ.29 వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.6,800 కోట్లు ఖర్చు చేశామని, మొత్తంగా రైతుల ఖాతాల్లో లక్ష కోట్లకు పైగా నేరుగా జమ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించి దేశంలో ఆదర్శంగా నిలిచామని అన్నారు. రైతును కేంద్రబిందువుగా చేసుకుని అమలు చేసిన విధానాల వల్ల తెలంగాణలో వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు. 2014కు ముందు కోటి 31 లక్షల ఎకరాలుగా ఉన్న పంట విస్తీర్ణం 2023 నాటికి 2 కోట్ల 30 లక్షల ఎకరాలకు పెరిగిందని చెప్పారు. బీడు భూములు పచ్చని మాగాణాలుగా మారాయని, తెలంగాణ దేశానికే ఆహార ధాన్య ఉత్పత్తిలో కీలక రాష్ట్రంగా ఎదిగిందని పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా ఏడు వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు వద్దే చివరి గింజ వరకు కొనుగోలు చేశామని, వరితో పాటు మొక్కజొన్న, జొన్న, శనగ, కందులు, పెసలు, సన్‌ఫ్లవర్, సోయాబీన్ వంటి పంటలను కూడా కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్‌లో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని చింతా ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వం రావాలనే భావన ప్రజల్లో బలపడుతోందని, రాష్ట్ర సంపదను ఢిల్లీకి తరలించడమే ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు. అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రైతుల భూములను భయపెట్టి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని మంత్రులు, జిల్లా కలెక్టర్‌ను కలిసి కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి నిధులను కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని, కొత్త నిధులు తీసుకురాకుండా ప్రచారానికే పరిమితమవుతోందని చింతా ప్రభాకర్ విమర్శించారు. అక్రమ నిర్మాణాలు, పేదల భూముల ఆక్రమణలను సహించబోమని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, విఠల్, నాయకులు శ్రీధర్ రెడ్డి, గోవర్ధన్ నాయక్, సాబేర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment