సమ్మె పరిష్కారానికి కృతజ్ఞతలు తెలిపిన విశ్రాంత ఉద్యోగుల సంఘం.. పెండింగ్ బకాయిలు, వైద్య సదుపాయాలపై ప్రత్యేక విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 16: ఏప్రిల్ 23, 24, 25 తేదీల్లో జరిగిన కార్మికుల సమ్మెను సత్వరమే పరిష్కరించి, సమ్మె విరమణకు కృషి చేసిన యాజమాన్యానికి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. అదే సమయంలో విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వినతిపత్రం ద్వారా కోరింది. సంఘం ప్రధానంగా 2013 పీఆర్సీ యాజమాన్య కాంట్రిబ్యూషన్ బకాయిలను బర్కత్‌పుర పీఎఫ్ కార్యాలయంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీంతో ఉద్యోగుల పీఎఫ్ పెన్షన్ పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది. అలాగే, 2017 పీఆర్సీని విశ్రాంత ఉద్యోగులకు అమలు చేసి, దాదాపు ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరింది. ఇదే విధంగా 2021 పీఆర్సీ ఒప్పందం ప్రకారం విశ్రాంత ఉద్యోగులకు కూడా వర్తింపజేసి, వారికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని, అలాగే 2026 ఏప్రిల్ వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరికీ అన్ని బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేసింది.
సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి
సూపర్ లగ్జరీ సర్వీసుల్లో విశ్రాంత ఉద్యోగి, ఆయన జీవిత భాగస్వామికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సంఘం కోరింది.
వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలని విజ్ఞప్తి
తార్నాక ఆసుపత్రిలో గతంలో రెండు నెలలకు సరిపడా మందులు ఒకేసారి అందించేవారని, ప్రస్తుతం నెలనెలా మాత్రమే ఇస్తుండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వృద్ధ విశ్రాంత ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని సంఘం తెలిపింది. అందువల్ల పాత విధానాన్ని పునరుద్ధరించి, రెండు నెలల మందులను ఒకేసారి అందించాలని కోరింది. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆసుపత్రుల్లోనూ అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు సభ్యత్వం పొందలేకపోయిన విశ్రాంత ఉద్యోగులకు తార్నాక ఆసుపత్రి మెంబర్షిప్ పొందేందుకు మరో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
ఆర్టీసీలో సేవలందించి రిటైర్ అయిన ఉద్యోగి మరణించినప్పుడు అందించే రూ.30 వేల దహన సంస్కార సహాయాన్ని, వైద్య కారణాలతో ఉద్యోగ విరమణ చేసిన (మెడికల్ అన్‌ఫిట్) ఉద్యోగులు, స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) తీసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు కూడా వర్తింపజేయాలని సంఘం కోరింది.
విశ్రాంత ఉద్యోగులకు రెస్ట్‌రూమ్ సదుపాయం కల్పించాలి
బయటి జిల్లాల నుంచి చికిత్స కోసం తార్నాక ఆసుపత్రికి వచ్చే విశ్రాంత ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్న సంఘం, సీబీఎస్ లేదా జేబీఎస్‌లోని విశ్రాంతి గదుల్లో కనీసం నాలుగు పడకల సౌకర్యాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.
తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పై సమస్యలన్నింటినీ మానవతా దృక్పథంతో పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ యాజమాన్యాన్ని కోరింది. ఉద్యోగ జీవితమంతా సంస్థ అభివృద్ధికి సేవలందించిన విశ్రాంత ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేసింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ రాజయ్య, స్టేట్ జనరల్ సెక్రెటరీ బుచ్చిరెడ్డి, రీజినల్ ప్రెసిడెంట్ పి, రీజినల్ చైర్మన్ సత్యనారాయణ, రీజినల్ జనరల్ సెక్రెటరీ బి.కృష్ణమూర్తి, స్టేట్ జాయింట్ సెక్రెటరీ మురళీధర్, ఫారుక్, మారుతి, చీఫ్ అడ్వైజర్ వి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ గంగారం, ఆంజనేయులు, ఈశ్వరయ్య, బీర్బల్, జాయింట్ సెక్రెటరీ సుధాకర్, కిష్టయ్య, నరసింహులు, జనార్ధన్, ట్రెజరర్ బాలరాజు, పబ్లిసిటీ సెక్రటరీ వంటప్ప, దేవదానం, శివకుమార్, సంగారెడ్డి డిపో చైర్మెన్ కె.నవాజ్ . దుర్గారాములు, రాజిరెడ్డి , జి.నర్సిములు, పి.వి.గౌడ్ జీఆర్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment