రాయికోడ్ ఉరడమ్మ అమ్మవారికి ఘనంగా బోనాల సమర్పణ
రాయికోడ్, జులై 26 (SNM న్యూస్ ప్రతినిధి): సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలోని గ్రామదేవత శ్రీ ఉరడమ్మ అమ్మవారి ఆషాఢ బోనాల మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించిన ఈ మహోత్సవంలో మహిళలు, యువత, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం గ్రామస్థులు డప్పు వాయిద్యాల నడుమ వాగు వద్దకు చేరుకుని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించి తెప్పను నీటిలో వదిలి, అనంతరం పవిత్ర జలాలతో నిండు కుండను ఆలయానికి తీసుకొచ్చారు. ఆ జలాలతో ఉరడమ్మ అమ్మవారికి అభిషేకం నిర్వహించి విశేష పూజలు చేశారు.
తదనంతరం ఉరడమ్మ ఆలయం నుంచి దత్తు గౌడ్ నివాసం వరకు డప్పు వాయిద్యాల మధ్య ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. అక్కడ ప్రత్యేక పూజలు అనంతరం పచ్చికుండలో ఘటాన్ని తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి సంప్రదాయ ఆచారాలను నిర్వహించారు. మహోత్సవం సందర్భంగా ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, పిల్లలు, యువకులు, పెద్దల సంప్రదాయ నృత్యాలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు తలపై బోనాలను మోసుకుంటూ డప్పు వాయిద్యాల నడుమ పురవీధుల గుండా ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి భక్తిపూర్వకంగా సమర్పించారు. మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. గ్రామస్థులు, మహిళలు, యువత, చిన్నారులు విశేష సంఖ్యలో పాల్గొని ఉరడమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందారు. మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో విశేష కృషి చేసిన సేవకులు, దాతలు, నిర్వాహకులను శాలువాలతో ఘనంగా సన్మానించి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment