సంగారెడ్డి ప్రతినిధి: మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మంగళవారం సంగారెడ్డి పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో నిర్వహించిన జాతీయ స్థాయి అంతర్‌జిల్లా అథ్లెటిక్స్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు.
జాతీయ స్థాయి అంతర్‌జిల్లా అథ్లెటిక్స్ పోటీలకు సంగారెడ్డి జిల్లా నుంచి ఎంపికైన క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను నిర్మల జగ్గారెడ్డి పరిశీలించారు. నవంబర్ 14, 16 తేదీల్లో వోక్సెన్‌లో జరగనున్న పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బంగారు, వెండి, కాంస్య పతకాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు సోహైల్ అలీ, కార్యదర్శి జావిద్ అలీ, రవి, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment