-ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి, జూన్ 14: స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఎస్‌బీఐ ఆర్‌సెటీఐ) సంగారెడ్డిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) చైర్‌పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మగ్గం శిక్షణ పూర్తి చేసిన శిక్షణార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమం ప్రారంభంలో సంస్థ డైరెక్టర్ ఎం. రాజేష్ కుమార్ పుష్పగుచ్ఛం అందించి నిర్మలా జగ్గారెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శిక్షణార్థులు కరతాళధ్వనులతో ఆమెకు స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా బ్యూటీ పార్లర్ శిక్షణ పొందుతున్న 34 మంది శిక్షణార్థినులు రూపొందించిన బ్రైడల్ మేకప్ ప్రదర్శనను నిర్మలా జగ్గారెడ్డి తిలకించారు. అమ్మవారి, భారతమాత వేషధారణలతో పాటు వివిధ సాంప్రదాయ అలంకరణలతో రూపొందించిన ప్రదర్శనలు ఆమెను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంస్థ డైరెక్టర్ ఎం. రాజేష్ కుమార్ మాట్లాడుతూ, ఎస్‌బీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సంస్థలో గ్రామీణ యువతకు పూర్తిగా ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందిస్తున్నామని తెలిపారు. శిక్షణతో పాటు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారిలో అధిక శాతం మంది స్వయం ఉపాధి లేదా వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందుతూ జీవితంలో స్థిరపడుతున్నారని వివరించారు. సంస్థ అందిస్తున్న సేవలను నిర్మలా జగ్గారెడ్డి ప్రశంసిస్తూ, గ్రామీణ యువత సాధికారత కోసం కృషి చేస్తున్న డైరెక్టర్ ఎం. రాజేష్ కుమార్‌తో పాటు సంస్థ సిబ్బందిని అభినందించారు. నంతరం ఆమె మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ విజయపథంలో దూసుకెళ్తున్నారని అన్నారు. "ఆడపిల్ల అభల కాదు... ఆది పరాశక్తి" అని పేర్కొంటూ ప్రతి మహిళ ఆర్థిక, సామాజిక రంగాల్లో స్వయం శక్తితో ఎదగాలని పిలుపునిచ్చారు. ఎక్కడ అన్యాయం జరిగినా ధైర్యంగా ప్రశ్నించి, తమ హక్కుల సాధన కోసం ముందుకు రావాలని సూచించారు. శిక్షణార్థులు తాము నేర్చుకున్న నైపుణ్యాలను నిరంతరం అభ్యసిస్తూ స్వయం ఉపాధి ద్వారా గౌరవప్రదమైన జీవనాన్ని నిర్మించుకోవాలని ఆమె సూచించారు. భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సేవలను స్మరించుకుంటూ, ఆమె నాయకత్వం మహిళలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహిళలు తమ ప్రతిభపై విశ్వాసం పెంచుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రవీందర్ నాయక్, సంస్థ కో-ఆర్డినేటర్లు శివశంకర్, నర్సింలు, జేఆర్‌పీ లక్ష్మీప్రియ, దుర్గతో పాటు పలువురు సిబ్బంది, శిక్షణార్థులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment